తెలంగాణా లో ఎస్టీ, ఎస్సీ జాబితాలో అర్హత సాధించే సంచార కులాలు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

తెలంగాణా లో ఎస్టీ, ఎస్సీ జాబితాలో అర్హత సాధించే సంచార కులాలు

బుధ, 25/01/2017 - 07:15
0 comments

ఎస్టీ, ఎస్సీ జాబితాలో అర్హత సాధించే సంచార కులాలు (ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్నాయి). (1) సురబీ నాటకాల వారు – 4058, (2) బహురూపి – 17690, (3) బాలసంతు – 7860, (4) బుడుబుక్కల – 7323, (5) బుక్క – 3994, (6) దాసరి – 25013, (7) దేవరవాండ్లు – 2152, (8) దొమ్మర – 8078, (9) గంగిరెద్దుల వారు – 11213, (10) జోగి – 4308, (11) కంజరబట్ట – 570, (12) కాటిపాపల – 1443, (13) మందుల – 17098, (14) నక్కల – 871, (15) వడ్డెర – 164399, (16) పూసల, పూసవెర్ల – 31731, (17) పంబాల – 793, (18) పెద్దమ్మల – 2285, (19) పిచుక గుంట్ల – 21200, (20) రాజన్నల – 4340, (21) సిక్లిగర్ – 4543.

 

సంచార జాతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఒక ప్రత్యేక కమిషన్ నియమించి సమగ్ర అధ్యయనం చేయాలి. తాత్కాలికంగా ఆర్థిక ఫెడరేషన్లు కాకుండా సంచార జాతుల నుంచిఒక ప్రతినిధిని కేబినెట్ స్థాయిలో నియమించాలి. ఈ జాతులకు ప్రాతినిధ్యం ఉండేలా చొరవతీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డునే తిరగరాసినట్టవుతుంది.

 

తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం చేయబోతున్న సాహసాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి. కుల వ్యవస్థ పునాదుల మీద వేళ్లూనుకున్న ఈ సమాజంలో సామాజిక న్యాయం సంచార జాతులకు మిథ్యే. కుల బలం, ఆర్థిక బలం వెరసి సామాజిక ఆధిపత్య ధోరణి సంచార జాతులకు అధికారం అందని ద్రాక్షలా చేస్తోంది. తాజాగా రిజర్వేషన్ల విషయానికొస్తే... ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్‌లను పెంచుతామని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలిచ్చి ముస్లింల కోసం సుధీర్ కమిషన్, ఎస్టీల కోసం చెల్లప్ప కమిషన్‌లు వేసి కొన్ని ప్రతిపాదనలను స్వీకరించింది. ముస్లింల రిజర్వేషన్‌ను ౯ శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎస్టీల రిజర్వేషన్లు 12 శాతానికి పెంచాలని సూచనమాత్రంగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రిజర్వేషన్లు పెంచాలన్న ప్రతిపాదనలను ముస్లిం మైనార్టీలు, గిరిజన తెగలు స్వాగతిస్తున్నప్పటికీ కొన్ని అణగారిన కులాలు ఇప్పటికే తమ సంగతి ఏంటని అర్థిస్తున్నాయి.

 

సంచార తెగల్లో భాగమైన మెహతర్ కులస్తులు బీసీ–ఏ జాబితాలో ఉన్నారు. అలాగే నూర్బాషా, దూదేకుల, పింజారీ, లద్దాపు కులాలు బీసీ–బీ జాబితాలో ఉన్నాయి. కడు దుర్భర జీవితాలను గడిపే ఫకీర్లు, అత్తరుసాహేబ్‌లు, కాసీ వాళ్లు, దరువేసి, బొంతల సాహేబ్, కీలుగుర్రం, ఎలుగుబంట్ల ఫకీర్లు, గారడి, జింక సాహెబ్‌లు బీసీ–ఈ జాబితాలో ఉన్నారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు చేసి వీరిని ముస్లిం మైనార్టీలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా అయితే ప్రభుత్వం భావిస్తున్న ౯ శాతం రిజర్వేషన్ ప్రక్రియకు న్యాయం చేకూరే అవకాశాలున్నాయి. ఇలా చేయడం ద్వారా సంచార తెగల్లో ఉన్న కొన్ని మైనార్టీ కులాలకు న్యాయం చేసినట్టవుతోంది.

 

ఇన్నాళ్లూ వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా సంచార జాతికి చెందిన కులాలు తమను ఎస్టీ, ఎస్సీల జాబితాలో చేర్చాలని తారాస్థాయిలో ఉద్యమాలు చేశాయి. అయితే ఆ కులాలు అస్తిత్వ పోరాటానికే పరిమితమైన కారణంగా ఉనికిని చాటుకోలేకపోయాయి. తెలంగాణ ఉద్యమానికి పూర్వం న్యాయసమ్మతంగా తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని పూసల కుల హక్కుల పోరాట సమితి పేరిట పదేళ్ల పోరాటం సాగింది. ఫలితంగా బీసీ–డీ నుంచి అది బీసీ–ఏ లోకి మాత్రమే వచ్చింది. ఎస్సీ, ఎస్టీ జాబితాల సవరణ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బీసీ–ఏ లోకి మార్చి చేతులు దులుపుకున్నది.

 

అదే స్థాయిలో వడ్డెరలు కూడా పోరాటం చేశారు. కానీ కొత్తగా కొలువు దీరిన తెలంగాణ సర్కారు తన పార్టీ మేనిఫేస్టోలో సంచార జాతుల అంశాన్ని చేర్చి హామీ ఇచ్చింది. అయితే పాలమూరు జిల్లాలోని బోయ వాల్మీకి, నిజామాబాద్ జిల్లాలోని కాగితపు లంబాడ తెగలను మాత్రమే ఎస్టీలో చేర్చేందుకు కమిషన్ వేసి పని పూర్తిచేసింది. రేపో మాపో అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపబోతున్నది. అంటే ఇచ్చిన మాట మీద తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పక తప్పదు. మిగతా మైనార్టీ సంచార కులాలు ప్రభుత్వ కరుణ కోసం దీనంగా చూస్తున్నాయి. కుల బలం లేని సంచార కులాలు మహా అయితే రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది కూడా లేరు. రాజకీయ, ఆర్థిక, సామాజిక బలం లేని ఈ కులాలను ఎస్టీ, ఎస్సీ జాబితాలోకి చేరిస్తే రాజ్యాంగ ఫలాలు వీరికి కూడా వర్తించే అవకాశం ఉంది.

 

ఎస్టీ, ఎస్సీ జాబితాలో అర్హత సాధించే సంచార కులాలు (ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్నాయి). (1) సురబీ నాటకాల వారు – 4058, (2) బహురూపి – 17690, (3) బాలసంతు – 7860, (4) బుడుబుక్కల – 7323, (5) బుక్క – 3994, (6) దాసరి – 25013, (7) దేవరవాండ్లు – 2152, (8) దొమ్మర – 8078, (9) గంగిరెద్దుల వారు – 11213, (10) జోగి – 4308, (11) కంజరబట్ట – 570, (12) కాటిపాపల – 1443, (13) మందుల – 17098, (14) నక్కల – 871, (15) వడ్డెర – 164399, (16) పూసల, పూసవెర్ల – 31731, (17) పంబాల – 793, (18) పెద్దమ్మల – 2285, (19) పిచుక గుంట్ల – 21200, (20) రాజన్నల – 4340, (21) సిక్లిగర్ – 4543.

 

ఇందులో ఒక్క వడ్డెర కుల జనాభా మాత్రమే అధికంగా ఉన్నది. మిగిలిన కులాలు మైనార్టీలుగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఎస్టీ జాబితాలో చేర్చబోయే బోయ వాల్మీకి కులం వారు 2,90,771 మంది ఉన్నారు. అంటే జనాభా ప్రాతిపాదికన కాకుండా బిక్షాటన చేసే వారి స్థితిగతులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా కులాల వారిగా భిక్షాటన చేసేవారు కూడా ఉన్నారు. దీన్నిబట్టి స్వాతంత్ర్య భారతావనిలో సామాజిక న్యాయం ఎలా పరిఢవిల్లుతుందో ఇట్టే అర్థమవుతోంది. పార్టీలు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా సామాజికంగా ఎంబీసీ ఉద్యమం, సంచార జాతుల ఉద్యమం ఒక్కటై తమ వాణిని వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడక్కడా సభలు, సమావేశాలు నిర్వహించి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సామాజికంగా మంద బలంతో పాటు ఆర్థిక నేపథ్యానికే ప్రాధాన్యమిస్తున్న రాజకీయ పార్టీలు అవకాశాలు రాని అణగారిన జాతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.

 

సామాజిక, రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాల కోసం వెంపర్లాడుతున్న ఆ జాతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆయా జాతుల వారికి కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యగా బీసీ కమిషన్ తరహాలో సంచార జాతుల కోసం ప్రత్యేక కమిషన్ నియమిస్తే ఈ జాతులకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 75 వరకు సంచార జాతుల కులాలున్నాయి. ఇందులో పది ఎస్సీ జాబితాలో, నాలుగు కులాలు ఎస్టీ జాబితాలో, 27 కులాలు బీసీ జాబితాలో ఉన్నాయి. మిగిలిన 25 కులాలు ఏ జాబితాలో లేక కుల గుర్తింపునకు నోచుకోలేదు. ప్రత్యేక కమిషన్ నియమిస్తే ఈ జాతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసినట్టవుతోంది. ఈ జాతుల నుంచి ఓ ప్రతినిధిని నియమించి తద్వారా వారి వాణి, న్యాయమైన డిమాండ్లు బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఆర్థిక ఫెడరేషన్లు కాకుండా కేబినేట్ స్థాయిలో హోదా కల్పించి ఈ జాతులకు ప్రాతినిధ్యం ఉండేలా చొరవ తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డునే తిరగరాసినట్టవుతోంది. అయితే అవకాశాలను ఆర్థిక బలమున్నవారికీ, వెంపర్లాడేవారికీ కాక ఈ జాతుల పట్ల నిబద్ధత, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ప్రభుత్వ పనితీరుపై అవగాహన కలిగిన వారికి అవకాశం ఇచ్చి ఈ జాతులను పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేక హాస్టళ్లు, బీసీ కార్పొరేషన్ల రుణాల వంటివి మంజూరైనా ఏ పథకం కూడా వీరి దరిచేరడం లేదు. అందుకే నిబద్ధతగల నాయకుణ్ణి ఏరికోరి సమస్త సంచార జాతులకు సమన్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది.